ఇక్కడ రోజూ భూకంపమే..

,కరీంనగర్‌ : పచ్చని చెట్లు.. జలకళతో చెరువు... పక్షుల కిలకిలరాగాలు.. వ్యవసాయమే ఊపిరిగా బతికే పల్లె ప్రజలు.. పాడి పంటలతో ఆరేళ్ల క్రితం వరకు ఆ ఊరంతా కళకళలాడేది. సింగరేణి రంగప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పంటచేలు కనుమరుగయ్యాయి. ఊరు బొందలగడ్డగా మారింది. అభివృద్ధికి బొగ్గు అవసరమని, ఊరి భూగర్భంలో బొగ్గు నిల్వలున్నాయని అధికారులు గ్రామస్తులకు చెప్పి పంట భూములు, ఇళ్లు సేకరించారు. అభివృద్ధికి అడ్డుకావొద్దని గ్రామస్తులూ సహకరించారు. పరిహారంతోపాటు పునరావాసం కింద ఇళ్లు నిర్మిచుకునేందుకు ప్లాట్లు కేటాయిస్తామని సింగరేణి హామీ ఇచ్చింది. ఆరేళ్లు గడిచాయి. సింగరేణి బొగ్గు తవ్వుకుపోతోంది. సర్వం ధారపోసిన నిర్వాసితుల బతుకులు మాత్రం ఆగమయ్యాయి. పంట భూములకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యం పునరావాసం కోసం ప్లాట్లు కేటాయించడంలో జాప్యం చేస్తోంది. కోర్టు కేసులు పునరావాసానికి ఆటంకంగా మారాయి. దీంతో రామగిరి మండలం లద్నాపూర్‌లోని ఓసీపీ–2 ప్రభావిత ప్రజలు నిత్య బ్లాస్టింగ్‌లతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.